మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మందమర్రి: గత సంవత్సరం కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించడం ద్వారానే ఇది సాధ్యమని ఆయన డ్రైవర్లకు సూచించారు.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ ల ఆదేశాల మేరకు మందమర్రి టోల్ ప్లాజా సమీపంలో జరిగిన డ్రైవర్ల అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మందమర్రి సర్కిల్ పరిధిలోని మందమర్రి,రామకృష్ణాపూర్, కాసిపేట, దేవాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఆటో, స్కూల్ బస్సు, ట్రాక్టర్, లారీ డ్రైవర్ల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సదస్సులో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ… ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనం మంచి స్థితిలో ఉందో లేదో చూసుకోవాలి, అలాగే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా బైక్ నడిపేవారు హెల్మెట్‌ను, కారు నడిపేవారు సీట్ బెల్ట్‌ను తప్పనిసరిగా ధరించాలి.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదు, అతివేగంగా వెళ్ళకూడదు, మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా వాడటం మానుకోవాలని ఆయన గట్టిగా హెచ్చరించారు.
పోలీస్ శాఖ రోడ్డు భద్రత కోసం తీసుకుంటున్న కఠిన చర్యలను ఏసీపీ వివరించారు. డ్రైవర్లు సహకరించినప్పుడే ప్రమాదాల సంఖ్యను పూర్తిగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ కే.శశిధర్ రెడ్డి, సర్కిల్ ఎస్సైలు, జాతీయ రహదారి అధికారులు, పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
