మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ: 11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
నస్పూర్ మండలం సంగమల్లయ్యపల్లె గ్రామానికి చెందిన ఎం. వెంకటేశం తన ఇల్లు కూలిపోయినందున రికార్డుల నుండి ఇంటి నెంబర్ తొలగించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మందమర్రి పట్టణానికి చెందిన దుర్గం మోహన్ తాను నెన్నెల మండలం నెన్నెల శివారులో కొనుగోలు చేసిన భూమికి తన పేరిట పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన చింతం నారాయణ తనకు బట్వాన్ పల్లి శివారులో గల భూమికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరుపకూడదని కోరుతూ అర్జీ సమర్పించారు.
భీమారం మండలం సుంకరిపల్లి కాలనీకి చెందిన దుర్గం భాగ్య దినసరి కూలీ అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మాల మహానాడు ప్రతినిధులు తమ దరఖాస్తులో ప్రభుత్వం తీసుకువచ్చిన షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం శ్రీరాంపూర్ శాఖ ప్రతినిధులు తమ దరఖాస్తులో శ్రీరాంపూర్ ప్రాంతంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
మంచిర్యాల పట్టణంలోని 10, 28 వార్డులో గల మారుతీ నగర్ రోడ్ నం.2 కాలనీవాసులు తమ ప్రాంతంలో గల హనుమాన్ మందిర్ వెనుక నాలా వంకరగా ఉండడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తుందని, నాలాను ఎలాంటి వంకలు లేకుండా సరిచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కు చెందిన కోట మల్లయ్య తాను గత 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇల్లు వేరొకరి పేరిట మార్పు జరిగిందని, ఈ విషయమై తగు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
నస్పూర్ మండలం ఆర్ కె 6, కృష్ణ కాలనీకి చెందిన హరీష్ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ కె 6 లో గల సి టైప్ క్వార్టర్లకు సంబంధించి మురుగునీటి సెప్టిక్ ట్యాంక్ పగిలిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రతినిధి సికిందర్ తన దరఖాస్తులో చెన్నూర్ లో షెడ్యూల్డ్ కులాల కళాశాల, బాలుర వసతి గృహం, బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలని కోరారు.
లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన మామిడి రాజశేఖర్ దివ్యాంగుడు అయిన తాను ఇంటర్ పూర్తి చేసి ఎం. ఎల్. టి. 1 సంవత్సరం శిక్షణ పొందానని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం గుడి పేట గ్రామానికి చెందిన ఎంబడి జ్యోతి తన భర్త చనిపోయాడని, నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధి ముల్కల్ల రాజేంద్రప్రసాద్ తన దరఖాస్తులో నస్పూర్ శివారులో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
