మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ:11 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: నులి పురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్ రాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఉప వైద్యాధికారి డా. అనిత లతో కలిసి హాజరై విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలను తినిపించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

నులిపురుగులను నిర్మూలించి పిల్లల ఆరోగ్యం కొరకు అందరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో 1 లక్ష 58 వేల 480 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ మాత్రలను తినిపించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 930 అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో పిల్లలందరికీ మాత్రలు అందించడం జరుగుతుందని, వైద్య ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖలు, మున్సిపల్, గ్రామపంచాయతీ ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. నులి పురుగుల నిర్మూలనతో రక్తహీనత తగ్గి పిల్లలను పోషణ మెరుగుపడుతుందని, మానసిక, శారీరక అభివృద్ధి జరిగి అభ్యాసన సామర్థ్యం, పాఠశాలలో హాజరు శాతం పెరుగుతుందని తెలిపారు. పిల్లలందరికీ మాత్రలు తినిపించాలని, 1-3 వయసుగల పిల్లలకు సగం మాత్ర చూర్ణం చేసి నీటితో ఇవ్వాలని, 3 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఒక మాత్రను చప్పరించి తీసుకోమని చెప్పాలని, పరిశుభ్రమైన నీటిని త్రాగించాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రపరుచుకోవాలని తెలిపారు. పాదరక్షలు లేకుండా ఆటలు ఆడడం, బహిరంగ మలవిసర్జన, మురికి చేతులు కారణంగా నులిపురుగుల అభివృద్ధి జరిగి రక్తహీనత, ఆకలి లేకపోవడం ఇతర వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది పిల్లలందరికీ మాత్రలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. ఎ. ప్రసాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

error: -