ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ నారాయణాయ నమః
ఓం శ్రీ గురుభ్యోనమః
శ్రీ ధర్మపురి క్షేత్ర వైభవము
శుక్లాంబర ధరం దేవం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే ॥
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్ ॥
శ్రీమన్నీరధిజా మన స్సరసిజ ప్రాభాత పద్మాకరః |
బ్రహ్మేంద్రాది సురోత్తమాంగ మణిసంరాజత్పదాంభోరుహః॥
దైత్యేంద్ర ప్రమదేభరాన్మృగవరః ప్రహ్లాద సంరక్షకః |
శ్రీమాన్ ధర్మపురీశ్వరో నరహరిః కుర్యాత్సదా మంగళం ॥
పవనాశన పీఠాయ – గౌతమీ తీర వాసినే |
శ్రీమద్ధర్మపురీశాయ – శ్రీ నృసింహాయ మంగళం ॥
ఉగ్రం వీరం మహావిష్ణుం – జ్వలంతం సర్వతోముఖం |
నృసింహం భీషణం భద్రం – మృత్యోర్ముత్యుర్నమామ్యహం॥
శివ ! శంభో ! మహాదేవ ! శూలపాణే ! త్రిలోచన |
రామలింగ ! నమస్తుభ్యం – పాహి ! ధర్మపురీశ్వరా ||
దక్షిణాభిముఖీ గంగా – యత్రదేవో నృకేసరీ ।
తఛ్ఛీ ధర్మపురీ క్షేత్రం కాశ్యాః శతగుణం మహత్ ||
భూషణ వికాస ! శ్రీ ధర్మపుర నివాస । దుష్ట సంహార! నరసింహ ! దురితదూర ॥
చక్రధర ధర్మపురి ధామ ! సార్వభౌమ ।
నరహరే భక్త జనకల్ప – నాగతల్ప ॥
ధర్మపురి ప్రాచీన పుణ్య తీర్థ క్షేత్రము. ఇది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రమునకు 30 కి.మీ. దూరంలో కలదు. ధర్మపురి హరిహరక్షేత్రము. ఇచట గోదావరి నది దక్షిణ దిశగా ప్రవహించడం విశేషం. గోదావరినది ఇచట ప్రవహించడం చేత ఇది తీర్థక్షేత్రంగా ప్రసిద్ధికెక్కినది. ఇచటి స్థానిక క్షేత్రదైవం శ్రీ లక్ష్మీనృసింహస్వామి.
ఈ క్షేత్రంలో నృసింహుడు ఉగ్ర-యోగ రూపములతో స్వయంభువుగా కొలువు తీరి ఉండడం విశేషం. శ్రీరామచంద్రమూర్తి స్వహస్తాలతో ప్రతిష్ఠించిన సైకత శివలింగము శ్రీరామ లింగేశ్వరుడుగా పూజలందుకోవడం ఈ క్షేత్రము “హరిహరక్షేత్రం”గా ప్రసిద్ధి పొందుటకు కారణము.
ఈ పవిత్ర క్షేత్రం “దక్షిణకాశి”గా పిలువబడుతున్నది. దీనికి కారణం ధర్మపురీ క్షేత్ర మాహాత్మ్య గ్రంథంలోని ఈక్రింది శ్లోకమే తార్కాణము.
శ్లో॥ “దక్షిణాభిముఖీ గంగా – యత్రదేవో నృకేసరీ |
తచ్ఛీ ధర్మపురీ క్షేత్రం – కాశ్యాః శతగుణం మహత్ II
ఎక్కడైతే గోదావరి (గంగ) దక్షిణ దిశలో ప్రవహిస్తుందో, ఎక్కడైతే శ్రీ నృసింహుడు కొలువు ఉంటాడో ఆ ప్రదేశం కాశీ క్షేత్రం కన్నా వంద రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది.
పై శ్లోకం ద్వారా ధర్మపురిని “దక్షిణకాశీ” గా పిలుచుకోవడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
నవనారసింహక్షేత్రాల్లో ఒకటైన, త్రిమూర్తులకు నెలవైన (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) ఈ పవిత్ర క్షేత్ర పౌరాణిక గాథను తెలుసుకుందాం.
శ్రీ “ధర్మపురి” క్షేత్ర ప్రాచీన వైభవము
శ్లో॥ అగజానన పద్మార్కం – గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ॥
శ్లో॥ సురాసురైః సేవిత పాదపంకజాం ।
కరైర్విరాజిత్ కమనీయ పుస్తకా।
విరించి పత్నీ కమలాసనస్థాం ।
సరస్వతీ నృత్యతి వాచిమే సదా ॥
శ్లో॥ అజ్ఞాన తిమిరాంధస్య – జ్ఞానాంజన శలాకయా | చక్షురున్మీలితం యేన – తస్మైశ్రీ గురవే నమః |
శ్లో॥ నైమిశే నిమిషక్షేత్రే ఋషయః శౌనకా దయః |
సత్రం స్వర్గాయ లోకాయ – సహస్ర సమమాసత ॥
దేవతలకు నిలయమైన పరమ పవిత్రమగు నైమిశారణ్యము నందు శౌనకాది మహర్షులంతా భగవత్ప్రప్తి కొరకు వేయి సం||ల జ్ఞానయజ్ఞమును అనుష్ఠించిరి.
శ్లో॥ త ఏకదాతు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః |
సత్కృతం సూత మాసీనం పప్రచురిదమాదరాత్ ॥
శౌనకాది మహర్షులు ఒకనాటి ప్రాతఃకాలమున అగ్నిహోత్రాది నిత్యకర్మలను నిర్వర్తించుకొని అనంతరం సూత పౌరాణికుని వద్దకు వెళ్ళి వారిని అర్ఘ్యపాద్యాదులచే పూజించి వినయముతో ఈ విధముగా ప్రార్థించిరి.
శ్లో॥ త్వయాఖలు పురాణాని సేతి హాసానిచానఘ |
ఆఖ్యాతాన్యవ్యధీతాని – ధర్మశాస్త్రాణి యాన్యుత॥
ఓ పుణ్య పురుషా ! సూతమహాభాగ ! మీరు సకల ఇతిహాసములను, పురాణములను, ధర్మ శాస్త్రములను అధ్యయనము చేయటయే గాక చక్కగా శ్రోతలకు బోధపరచే శక్తిగలవారలు. మీ ద్వారా గతంలో ఎన్నో ఆసక్తికర విషయములను వినియుంటిమి. ఈరోజు మాకు భరతావనిలోని శ్రేష్ఠమైన పుణ్యక్షేత్రాన్ని గురించి దయతో తెలియజేయండని ప్రార్థించినారు.
అప్పుడు సూతుడు చాలా సంతోషించి శౌనకాదులతో మహర్షులారా ! చక్కని ప్రశ్నను అడిగితిరి. విశేష పుణ్యప్రదమైన, పరమ పవిత్రమైన క్షేత్ర రాజమును గురించి తెలియజేస్తాను. సావధాన చిత్తులై ఆలకించండని అనెను.
పూర్వం ఈ భరతావనిని పృథుమహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు ధర్మబద్ధంగా చాలా సంవత్సరములు రాజ్యపాలన చేసి వృద్ధాప్యము సమీపించగానే తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి, భార్యా సమేతుడై అరణ్యమునకు వెళ్ళినాడు. అచటనే ఒక ఆశ్రమము నిర్మించుకొని నివసించసాగెను.
ఒకరోజు అతని ఆశ్రమానికి త్రిలోకసంచారియైన నారద మహర్షి ఏతెంచగా పృథు దంపతులు ఎదురేగి సాష్టాంగ ప్రణామంబు లాచరించి, అర్ఘ్యపాద్యాదులచే పూజించి ఉచితాసనముపై కూర్చుండజేసిరి.
పృథుదంపతుల భక్తికి నారదుడు సంతసించి పృథువును తదేకంగా పరీక్షించి అతడు ఏదో బాధతో ఉన్నట్టు గమనించినాడు. రాజా ! నీవు సాక్షాత్ విష్ణుస్వరూపుడవు. ఈ పృథివిని చక్కగా పరిపాలించితివి. నీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసుకుంటివి. అటువంటి నీకు చింతలేముంటాయి ? ఒకవేళ ఏదైనా బాధ ఉంటే నాకు తెలియజేస్తే నివారణోపాయాన్ని తెలియజేస్తాను అని నారదుడు చెప్పగా పృథువు నారద మహర్షితో
శ్లో॥ బ్రహ్మన్ ! మజ్జనకః క్రూరో వేదధర్మవిరోధకః ।
భగవన్నిందకః సాధుజన పీడన తత్పరః ॥
మహర్షీ ! మీకు తెలియనిదేముంది ? నా తండ్రియగు వేనుడు బ్రతికున్న రోజులలో అధర్మమార్గమున ప్రవర్తించి, వర్ణ సంకరము గావించి చివరకు మహర్షుల కోపాగ్నికి బలియై కాలధర్మము నొందెను. అతనికి సద్గతి కలుగుటకై నేనెన్నియో సత్కర్మలు చేసితిని. దాన ధర్మములను చేసితిని. అనేక పుణ్యక్షేత్రములు దర్శించితిని. అయినను మా తండ్రి గారికి సద్గతి లభించలేదు. కారణము తెలియదు. మీరు సర్వజ్ఞులు. మామేలు కోరువారు మా తండ్రి గారి సమస్త పాపాలు నశించి సద్గతి లభించునుపాయము దయచేసి తెలియజేయండని కోరగా నారదుడు. పృథువుతో అంటున్నాడు.
ఓ రాజా ! బాధపడకు. భరత భూమి కర్మభూమి, వేద భూమి ఇచట అనేక పుణ్య నదులు, పుణ్యక్షేత్రాలు ఈ నేలను పవిత్రం చేస్తున్నాయి. ఈ భూమిపై జన్మించడమే సుకృతం. మీ తండ్రి గారికి సద్గతి కలిగించే పుణ్యతీర్థ క్షేత్రాన్ని గురించి తెలియజేస్తాను. సావధాన చిత్తముతో ఆలకించు.
శ్లో॥ బ్రహ్మాండే పి భవత్యేకం సర్వోత్కృష్టంత్వదీప్సితం ।
తాదృశంనైవ కుత్రాపి వీక్ష్యే సర్వచరోప్యహం ॥
శ్లో॥ భూమౌ తద్భారతవర్షే జంబూద్వీపేచ భూపతే |
గోదావరీతటే రమ్యే దండకారణ్య మండలే ॥
శ్లో॥ ధర్మపుర్యాఖ్యముత్కృష్టం సర్వతీర్థ నిషేవితం |
సమస్త దేవతాసంఘైః సమస్త ర్షిగణైరపి ॥
దక్షిణ భారతదేశములో దండకారణ్యంలో పవిత్ర గోదావరి తీరంలో ‘ధర్మపురి’ అను ప్రసిద్ద తీర్థ క్షేత్రము కలదు. అచట శ్రీ శ్రీ మహావిష్ణువు నృసింహ రూపములో కొలువై భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడు. ఆ క్షేత్రంలో గోదావరినది దక్షిణ దిశగా ప్రవహిస్తూ భక్తులను పునీతులు చేస్తుంది. పితృదేవతలకు దక్షిణ దిశ ఎంతో శ్రేష్ఠమైనది. నీవు ఆ క్షేత్రానికి వెళ్ళి గోదావరి నదిలో స్నానమాడి నీ పితృదేవునికి భక్తిపూర్వకంగా జలతర్పణం పిండ ప్రదానాదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వర్తించు. తప్పక శ్రీ లక్ష్మీనృసింహుని దర్శించు. మీ తండ్రి గారికి తప్పక సద్గతి లభిస్తుందని నారదుడు | పృథువుతో అన్నాడు. అది విన్న పృథువు ఆనందానికి అవధుల్లేవు.
మహర్షీ ! ధన్యోస్మి ! అలాంటి దివ్యక్షేత్రాన్ని గురించి, దాని ప్రాశస్త్యాన్ని గురించి దయచేసి తెలియజేయండి. ఈ క్షేత్రానికి ధర్మపురి అని పేరెట్లు వచ్చింది ? శ్రీ నృసింహుడు లక్ష్మీ సమేతుడై స్వయంభువుగా కొలువుండడానికి కారణమేమిటి ? అచటి గోదావరి విశిష్టతలు అన్నింటిని దయతో తెలియజేయవలసిందిగా ప్రార్థించినాడు.
అపుడు నారదుడు సంతసించి ధర్మపురీ క్షేత్ర వైభవాన్ని తెలియజేయుటకు పూనుకొని శ్రద్ధగా ఆలకించమని ప్రారంభిస్తూ వున్నాడు.
పూర్వం ధర్మవర్మ అను మహారాజు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతుండేవాడు. ధర్మకార్యము లందు ఆసక్తిగలవాడు. సత్య ధర్మ నిరతుడు.
“యథారాజా తథా ప్రజా” అన్నట్లు రాజ్యములోని ప్రజలందరు ధర్మమార్గమునే జీవనము సాగించుచుండిరి. అందుకే ఆ మహారాజు ఈ ప్రాంతానికి “ధర్మపురి” అను నామకరణమును చేసెను. ఆ రాజు నృసింహ భక్తుడు. నరసింహుని అనుగ్రహము కోరి అనేక సంవత్సరములు భక్తితో తపమాచరించెను. ధర్మవర్మ తపస్సు ఫలించి నరసింహుడు ప్రత్యక్షమాయెను. స్వామిని దర్శించిన వెంటనే సాష్టాంగ దండ ప్రణామములాచరించెను . అపుడు స్వామి ధర్మవర్మతో…..
ధర్మవర్మ ! నీ భక్తికి తపస్సుకు మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకో నాయనా ! అన్నాడు. అపుడు ధర్మవర్మ ! స్వామీ మీ దర్శనభాగ్యమే నాకు గొప్ప వరము. అయినా మీరు నాకు వరం ఇస్తామన్నారు కావున కోరుకుంటున్నాను. స్వామీ ! నా రాజ్యంలో ఉండే ప్రజలకు ఎలాంటి ఆపదలు కలుగకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేలా మీరు ఈ ధర్మపురిలో లక్ష్మీసమేతులై కొలువై ఉండాలి అని ప్రార్థించినాడు.
అపుడు స్వామి ధర్మవర్మతో…..
ధర్మవర్మా ! “అహం భక్తాపరాధీనః” నేను భక్తపరాధీనుడను. భక్తుల కోరికను కాదనలేను. నీ కోరికను మన్నించి శ్రీ మహాలక్ష్మీ సమేతుడనై నన్ను దర్శించే భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఇక్కడే కొలువై ఉంటానని ధర్మవర్మకు మాట ఇచ్చి తక్షణమే స్వయంభువుగా స్వామి కొలువైనాడు.