ఈ క్షేత్రమునకు ‘ధర్మపురి’ అని పేరు ఏర్పడిన విధానము స్వామి ధర్మవర్మ కోరిక మేరకు స్వయంభువుగా వెలసిన తీరును విన్న పృథువు మిగుల ఆనందించి క్షేత్రమునకు గంగామాత విధమును ఆమెను గోదావరి పేరుతో పిలుచుటకు కారణము మరియు గోదావరి విశిష్టతలు తెలియజేయవలసినదిగా నారదుని పృథువు ప్రార్థించెను.

సంతసించి చెప్పడం ఆరంభించినాడు నారదమహర్షి

వాగర్థావివ సంపృత్తా వాగర్థ ప్రతిపత్తయే ||
జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ ॥

రాజా! కైలాస పర్వతముపై పరమశివుడు ప్రమథ గణములు మ కొలుచుచుండగా కొలువై ఉన్నాడు.

శ్లో॥ శృణుధ్వం బలిముఖ్యాస్తన్మాహాత్మ్య ప్రతిపాదకం |
గంగా శంకర సంవాదం కథయామ్యచ్యుత ప్రియం ॥

శ్లో॥ కదాచిచ్ఛంకరో రమ్యే కైలాసస్య మహీభృతః ।
శిఖరే సన్నిషణ్ణి.. భూద్ ధ్యాతుం రహసి మాధవం ॥

మాధవుని ధ్యాన నిష్ఠలోనున్న పరమ శివుని వద్దకు గంగాదేవి ఏతెంచి స్వామితో ఈ విధంగా అంటుంది.

శ్లో॥ దేవదేవ జగన్నాథ ! మహాదేవ ! త్రిలోచన |
పరంజ్యోతిర్భవాన్ దేవ ! లోకసృష్టివ్యయానికృత్ II

శ్లో॥ యథాత్వం సర్వదేవానాం ప్రభుః పూజ్యోసిచావ్యయః ।
యథాగౌరీ సమస్తానాం స్త్రీణాంమధ్యే గరీయసి ||

శ్లో॥ యథా విష్ణుః సమస్తానాం దేవతానాం గణేమహాన్ |
తథాహం సరితాం మధ్యే భవిష్యామి గరీయసి ॥

హే ప్రభో! నీలకంఠా ! భూమిపై ప్రవహించే నదులన్నింటిలోను నాకు ఆధిక్యత, శ్రేష్ఠత కల్గునట్లు వరం అనుగ్రహించండి అని ప్రార్థించింది.

గంగాదేవి ప్రార్ధన విన్న పరమ శివుడు చిరునవ్వు నవ్వి దేవీ ! నీ కోరిక కాదంటానా ? అయితే విను. దండకారణ్యమున పరమ పవిత్రమైన ‘ధర్మపురి’ అనుక్షేత్రము గలదు. అచట శ్రీహరి నరసింహ రూపములో వెలసి భక్తుల అభీష్టములు నెరవేరుస్తున్నాడు. నీవు అచటికి వెళ్ళి ఆ దేవదేవుని పూజింపుము. నీకు సకల నదులలో శ్రేష్ఠత్వము చేకూరుతుంది. మరొక విషయము వినుము దేవి.

ప్రస్తుతం త్రయంబక క్షేత్రమందు గల బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి గంగాజల స్పర్శకై తపము చేయుచున్నాడు. నీవు అతని వెంట ప్రవాహ రూపముగా బయలువెడలి ధర్మపురీ క్షేత్రమునకు చేరుకొని నృసింహుని సేవించి, స్వామి అనుగ్రహమును పొంది. సముద్రమునకు చేరుము. నేను కూడా నీ వెంట త్రయంబక క్షేత్రమునకు వచ్చెదనని గంగా దేవిని తన జటాజూటమున నిలుపుకొని త్రయంబక క్షేత్రమునకు బయలుదేరెను. అచట చాలా సంవత్సరాలుగా తపము చేయుచున్న గౌతమ మహర్షిని చూచి అతని ఎదుట గంగా సమేతుడై ప్రత్యక్షమాయెను.

గౌతమ మహర్షి కైలాస వాసుని గాంచి సాష్టాంగ నమస్కారములు చేసెను. భోళాశంకర ! ఇన్నాళ్ళకు నా పైన నీదయ కలిగిందా స్వామీ అని వేనోళ్ళ ప్రస్తుతించగా స్వామి ప్రసన్నుడై గౌతమా నీ తపస్సునకు సంతసించాను. నీ కోరిక తెలియజేయుమనగా ఏమని చెప్పను దేవా ! అంతా నా ప్రారబ్ధం.

ఒకనాడు నేను అగ్ని హోత్రము చేయుచుండగా నా ఆశ్రమమునకు ఒక గోవు వచ్చి యజ్ఞ ద్రవ్యమును నోటితో వే తాకుచుండెను. అది గమనించిన నేను దర్భ కర్రతో అదిలించితిని. ఆ మాత్రానికే ఆ గోవు మరణించినది. నాకు గోహత్యాపాతకము అంటుకొనెను. ఆ దోషము తొలగిపోవుటకు తమరి జటాజూటమున గల గంగా జలమును విడవమని ఆ జలములచే నా దోషము తొలగిపోగలదని దీనంగా ప్రార్థించినాడు.

గౌతముని కోరికను విన్న పరమశివుడు గంగను వదలగా ఆ పుణ్యజలములచే గౌతముడు గోహత్యా పాతకము నుండి విముక్తుడాయెను. తదుపరి శివుని ఆజ్ఞచే ఆ మహర్షి గంగాజలాన్ని తన వెంట తీసుకవెళుతూ దక్షిణ దేశానికి బయలుదేరుతూ అనేక పుణ్యక్షేత్రాల గుండా ప్రయాణం చేస్తూ పవిత్రమైన ధర్మపురీ క్షేత్రానికి చేరుకున్నాడు. క్షేత్రదైవమైన నరసింహుని దర్శించి గంగాదేవి భక్తిశ్రద్ధలతో పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందింది. గౌతమ మహర్షిచే తేబడినది గావున గంగకు గౌతమి అని పేరు వచ్చినది. గౌతముని గోహత్యా దోషాన్ని నివారింపజేసినది కావున ‘గోదావరి” అని ఆ నదీమ తల్లికి పేర్లు వచ్చినవి. శ్రీ నరసింహుడు పరమ శివుడు ఇరువుని అనుగ్రహముచే గంగకు శ్రేష్ఠత్వము లభించినది.

గోదావరి విశిష్ఠత

ఇచటి గోదావరి దక్షిణ దిశగా పరుగులు పెడుతుంది. దక్షిణ దిశ పితృదేవతలకు శ్రేష్ఠమైనందున ఈ క్షేత్రములోని గోదావరిలో ఆచరించే స్నానాదులు, జలతర్పణ, పిండప్రదానాదులు విశేష ఫలితాలనిచ్చి పితృదేవతలకు ముక్తి కలిగించి సంతానానికి, వంశవృద్ధికి దోహదపడతాయి అని నారదుడు పృథు మహారాజుకు తెలియజేసినాడు.

“గంగా శంకర సంవాద” రూపమైన ఈ గోదావరి పవిత్రం చరిత్రను ఎవరైతే వింటారో వినిపిస్తుంటారో వారి వంశములు వృద్ధి పొందును.

నారద మహర్షి చెప్పిన విషయములు విన్నప్పుడు మహారాజు పరమ సంతోషముందెను. అపుడు నారదుడు ఓ పృథు మహారాజా!.. మీ తండ్రి గారికి ముక్తిని ప్రసాదించగల ఈ క్షేత్రానికి వెళ్ళి అచట వేసునికి జలతర్పణ, పిండప్రదానాదులు శాస్త్రోక్తముగా జరిపించుకొని తరించవలసిందిగా తెలియజేసి నిష్క్రమించినాడు.

పృధు మహారాజు తన కుటుంబంతో పరివార జనంతో ‘ కలిసి ‘ధర్మపురీ’ క్షేత్రానికి బయలుదేరినాడు. క్షేత్రమునకు చేరుకోగానే ఎచట చూచినా వేదనాదాలు, పురాణ ప్రవచనాలు, నామ సంకీర్తనలతో అపర వైకుంఠంలా అలరారుతున్న క్షేత్రాన్ని దర్శించి చెప్పలేని ఆనందాన్ని పొందాడు.

పృథువు పవిత్ర గోదావరి తీరానికి వెళ్లి అక్కడ తన తండ్రికి శాస్త్రోక్తంగా విధివిధానముగా బ్రాహ్మణోత్తములచే జల, తర్పణ పిండప్రదానాదికాలు నిర్వర్తించినాడు. క్షేత్ర దైవమైన లక్ష్మీనృసింహుని దర్శించి రాత్రి దేవాలయములో నిదుర చేసెను. రాత్రి స్వప్నంలో పృథువుకు నరసింహుడు దర్శనమొసగి పృథు మహారాజా ! మీ తండ్రి గారు ఈ క్షేత్రములో నీచే చేయబడిన జల, తర్పణ పిండ ప్రదానాదికాలతో సమస్త పాపముల నుండి విముక్తి పొందినాడు. నీవు నా దర్శనము చేసినందు వలన నీ తండ్రికి సద్గతిని ప్రసాదించితిని అని చెప్పి అంతర్ధాన మొందెను అని సూతుడు శౌనకాది మహర్షులతో చెప్పెను.

శౌనకాదులు సూత మహర్షితో ఈ విధంగా అంటున్నారు. మీ వాక్కులు అమృత తుల్యములు. మీ ద్వారా అత్యంత పవిత్ర తీర్థక్షేత్రమైన ధర్మపురి గురించి కొంత తెలుసుకోగలిగాము.

మీరు చెపుతుంటే ఇంకా వినాలని ఉంది.

మరిన్ని ధర్మపురి విశేషాలు తెలియజేయండి అని కోరగాం సూతుడు సంతసించి ఋషులారా ! దక్షిణ దిశకు అధిపతియైన నరకాధిపతి యమ ధర్మరాజు ఒకరోజు ఈ విధంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఈ నరక లోకంలో నేను ప్రతిరోజు అనేక మంది పాపాత్ములను దర్శించడం వలన నా యొక్క పాపసంచయము పెరిగిపోవుచున్నది. స్వయముగా నేను చేసిన పాపమేదీ లేదు. విధి నిర్వహణలో భాగంగా నేను వారిని దర్శించవలసి వస్తుంది. నాకు మనశ్శాంతి లేకుండా పోతున్నది అని కొద్ది రోజులు విశ్రాంతి కొరకు పుణ్యక్షేత్ర సందర్శనానికి బయలుదేరినాడు.

భారత దేశములోని అనేక దివ్యక్షేత్రాలను దర్శించుకున్న యముడు (సమవర్తి) ధర్మపురీ దివ్య క్షేత్రానికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరీ నదిలో సంకల్ప సహితముగా స్నానమాచరించినాడు.

గోదావరి జలస్పర్శచే అతని పాప సంచయము భస్మమాయెను. మనసు ప్రశాంతమాయెను. తర్వాత నృసింహుని దర్శించుకుని భక్తితో స్తోత్రము చేయగా

శ్లో॥ స్తోత్రేణానేన తుష్టో హం యమ ! సంయమనీ పతే | వరం దాస్యామి భక్తాయ తుభ్యం మద్గత చేతసే ॥

నృసింహుడు ప్రసన్నుడై, ప్రత్యక్షమై ఓ యమధర్మరాజ ! నీవు నా క్షేత్రాన్ని దర్శించినందు వలన ఇక నుండి నీకు నీ విధి నిర్వహణలో ఎలాంటి పాపులను చూచినా గూడా దోషము, పాపము కలుగవు. ఈ క్షేత్రంలో నీవు స్నానమాడిన ప్రదేశము యమగుండంగా పిలువబడుతుంది. ఈ క్షేత్రములో నిన్ను దర్శిస్తే యమలోకపు బాధలు భక్తులకు కలుగకుండా వరమిస్తున్నాను. అందుకే ‘ధర్మపురికి పోతే యమపురి’ లేదు అంటారు.