అరుణాచల్ ప్రదేశ్
మహాభారతంలోనూ, కల్కి పురాణంలోనూ ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రసక్తి వస్తుంది. ఇక్కడి హిమగిరుల్ని ప్రభు శిఖరాలు అని పిలుస్తారు. పరశు రాముడిక్కడ రాజవధల ద్వారా సంక్రమించిన పాపాన్నిక్కడ ప్రక్షాళనం చేస్తున్నాడట. వ్యాస మహర్షి కొంత కాలం తపోనిష్ఠలో గడిపాడట. రాజా భీష్మకుడు ఈ రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించింది ఇక్కణ్ణుంచే.
భారతదేశంలో ముందుగా సూర్యుడు ఉదయించేదిక్కణ్ణుంచే. అందుకే ఈ రాష్ట్రాన్ని ‘ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్’ అని పిలవటం జరుగుతోంది. ఇక్కడి పుణ్యక్షేత్రాలూ, బౌద్ధారామాలూ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. స్థానికంగా వున్న అనేక మందిరాలు భక్తుల్ని పరవశుల్ని చేస్తాయి.
తవాంగ్
ఇది అరుణాచల్ ప్రదేశ్ కు వాయు వ్యాస వున్న ఓ చిన్న పట్టణం. దీనికి ఒక్కపక్క చైనా రెండవ పక్క బూటాన్ సరిహద్దులుగా వుంటుంది. సాధారణంగా ఈ పట్టణాన్ని యుద్ధ సమయాలలో తప్ప మిగిలిన సమయాలలో పట్టించుకోరు. తవాంగ్ ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవికాలంలో మంచు కరిగి తక్కువగా వుంటుంది. ఇక్కడి జలపాతాలు, సరస్సులు సరిహద్దులోని మైదాన దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి. 17వ శతాబ్ధిలో బౌద్ధ మతంలోని భిన్న వర్గాల మధ్య స్పర్థలు వచ్చాయి. మీరాలామా అనే బౌద్ధ సన్యాసి తన తెగకు చెందిన గులుక్ పా వర్గపు సన్యాసులను రక్షించుటకై ఒక కోటను నిర్మించాడు. దాన్ని నేడు తవాంగ్ చైత్యం అని పిలుస్తున్నారు
ఐతానగర్
ఐతానగర్ అరుణాచల్ ప్రదేశ్ కు రాజధాని. ఇది ఓ పెద్ద చారిత్రక పట్టణం అని అందరికీ తెలుసు. దీన్ని మాయాపూర్ అని 14, 15 శతాబ్దాలలో పిలిచేవారు. ఐతానగర్ కోట, బౌద్ధారామం, జవహర్లాల్ మెమోరియల్ మ్యూజియం, జూ, క్రాఫ్ట్ సెంటర్, పోలో, బోటింగ్ సౌకర్యాలు మరియు ట్రెక్కింగ్కు ఎంతో అనువైన ప్రదేశంగా విరాజిల్లుతోంది.
మలినితాన్ మందిరం
పశ్చిమ సియాంగ్ జిల్లాలోని సియాంగ్ కొండల ద్వారంలో వుందీ శిధిల మందిరం. ‘లికాబలీ’ అనే చోటు ఇక్కడికి దగ్గరగా వుంటుంది. క్రీ.శ. 14వ శతాబ్ద కాలం నాటి మందిరాల అవశేషాల్ని ఆర్కియాలజీ విభాగం త్రవ్వకాల్ని జరిపి బహిర్గతం చేసింది.
ఇక్కడ లభించిన విగ్రహాల్లో ఐరావతం, సూర్య రథం ముఖ్యమయినవి. స్థానికంగా దుర్గా మందిరం ఉంది. పౌరాణిక గాథానుసారం శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి ఆమెను శిశుపాలుడి ఆపద నుంచి తప్పించాడట. శ్రీకృష్ణుణ్ణి, రుక్మిణినీ పార్వతీ దేవి ఇక్కడికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిందట. ఇక్కడ పార్వతీదేవిని ‘మాలినీ దేవి’ అని పిలుస్తారు. ఆ పేరిటనే ఈ మందిరం ఏర్పడింది. గౌహతి నుంచి బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు.
భీస్ మాక్ నగర్
దిబాంగ్ జిల్లాలోని పర్యాటక స్థలం భీస్ మాక్ నగర్. ఈ పట్టణం పన్నెండవ శతాబ్ద కాలానికి చెందిన చుటియా రాజవంశీకుల కాలం నాటిదిగా చెప్పబడుతోంది. ఇక్కడ ఆర్యుల కాలం నాటి నాగరికతా చిహ్నాలు కనిపిస్తాయి. తీన్ సుకియా రైల్వేస్టేషన్ కి సుమారు వంద కి.మీ. దూరంలో వుంటుందీ ప్రాచీన పట్టణం. ఇక్కడికి చారిత్రక శిధిలాల్ని పర్యాటకులు అధిక సంఖ్యలో దర్శిస్తుంటారు.
అక్షయ గంగ
క్రీ.శ. ఎనిమిదవ శతాబ్ద కాలానికి చెందిన పార్వతీ మందిరం అక్షయ గంగ. కల్కి పురాణంలో ఈ స్థల ప్రస్తావన వస్తుంది. శంకరుడు అనగా శివుడు సతీదేవి పార్థివ శరీరంతో ఈ ప్రాంతంలో దుఃఖితుడై నిలిచిపోయాడట. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్నుపయోగించి సతీదేవి. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి వేసాడట. ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో ఆ సతీదేవి. శరీర భాగం ఒకటి ఈ ప్రాంతంలో రాలిందట. అదీ జీవన గంగ అయిన ఓ సెలయేరు ప్రాంతం కావటంతో ‘అక్షయ గంగ’ అనే పేరు వచ్చింది.
స్థానికంగా ఓ సరస్సు ఉంది. దానిని ఆనుకునే బ్రహ్మపుత్రానది ప్రవహిస్తోంది. భక్తులు ఈ సరస్సులోనూ, అక్షయ గంగలోనూ స్నానాలాచరించి దగ్గరలోని శివమందిరాల్ని దర్శిస్తారు.
పరశురాం కుండ్
తేజూ జిల్లా కేంద్రానికి 13 కి.మీ. దూరంలో వుందీ పుణ్యక్షేత్రం. వేలాది యాత్రికులీ మందిరాన్ని సంవత్సరం పొడవునా దర్శిస్తూ వుంటారు. జనవరి నెలలో ఇక్కడ ఓ ఉత్సవం జరుగుతుంది.
తస్సంగొంపా
ఇక్కడకు చేరాలంటే తవాంగ్ నుంచి కారులో ఒక అరగంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది అరుణాచలప్రదేశ్లోని పవిత్ర బౌద్ధక్షేత్రం. కొండల మధ్య మహారాజులా నిలబడి వుంది. ఇక్కడ నిర్మించిన చైత్యం పద్మసంభవుడు. ఆయన బుద్ధ సిద్ధాంతాలను ఈ ప్రాంతానికి తెచ్చాడు. అరుణాచలప్రదేశ్ పరిసర ప్రాంతంలో వున్న ఓ గుహలో ఆయన పాదముద్రలు వున్నాయని ప్రతీతి. ఆయన ఎక్కి వచ్చిన గుర్రపు కాలి గిట్టల గుర్తులు కూడా ఈ గుహలో వున్నాయని కూడా చెప్తారు. అందుకనే ఈ ప్రాంతానికి తక్ అనే పేరు వచ్చింది. ఇక్కడకు మూడు మైళ్ళ దూరంలో అ సంగేసర్లేక్ వుంది. ఇక్కడ నుండి గొంప ప్రాంతానికి వెళ్ళేందుకు మార్గాన్ని ఎన్నుకోవచ్చు.
బొమిడిలా
దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తులో వున్న హిల్ స్టేషన్ బొమిడిలా. అతి సుందర ప్రకృతి దృశ్యాలతో అలరారుతున్న ఈ కొండ పట్టణం దర్శకుల తాకిడికి తలక్రిందులవుతూ ఉంటుంది. ఇక్కడి బౌద్ధారామాలకి బౌద్ధ మతస్థులు కూడా చాలా అధిక సంఖ్యలో వస్తూఉంటారు. ఇక్కడి దీరాంగ్ లోయ తప్పక దర్శించదగ్గది. తేజ్పూర్, గౌహతిల నుండి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
చూడవలసిన మరిన్నీ ప్రదేశాలు
తవాంగ్ చేరేందుకు 200 మైళ్ళు హిమాలయ పర్వతాలపై ప్రయాణం చేయాలి. తేజపూర్ నుంచి ఇక్కడకు 80 నిమిషాలలో హెలికాప్టర్ మీద ప్రయాణం చేయవచ్చు. హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే రోజు రోడ్డుమీద కనిపించే ఎన్నో సుందర దృశ్యాలు చూడలేని వారం అవుతాము. ఇక్కడ నుండి అస్సాం, అరుణాచలప్రదేశ్లను విభజించే తేజపూరు యాత్రికులు, వినోద పర్యాటకులు వస్తారు.
బొమిడిలా నుండి 109 కి.మీ. దూరంలోని 13828 అడుగుల ఎత్తు వరకు కారు మీద ప్రయాణం చేయవచ్చు. ఇక్కడి రోడ్లు సరిగా వుండవు. సంగ్రిల్లా, బైసాకి, ఆర్మి స్థావరాలు దాటిన తరువాత కొండపైన ఒక గుడి వుంది. ఈ గుడిని హిందూ, బౌద్ధులు సమానంగా పూజిస్తారు. గుడికి దగ్గరలో పైన్ అడవులు వున్నాయి. ఇక్కడకు 21 కి.మీ. దూరంలో జస్వంతర్ అనే ఒక సైనిక మ్యూజియం వుంది. తవాంగ్లోయ తవాంగ్ చైత్యానికి 57 కి.మీ. దూరంలో వుంది. బహు గ్రామం చైనా సరిహద్దు ప్రాంతం అయిన ఐరల్లాను కలిసి వుంటుంది.
తవాంగ్ చైత్యం 16వ శతాబ్దిలో నిర్మితమైంది. ఇది ఈ ప్రాంతాన్ని 400 ఏళ్ళ నుండి ప్రభావితం చేస్తోంది. ఇక్కడ వున్న బుద్ధ ప్రధాన ఆచార్యుణ్ణి నీరాలామా అని అంటారు. ఆయన ఈ చైత్యం కట్టేందుకు కారకుడు. నీరాలామా తమ వర్గాన్ని మిగిలిన వర్గాల వారితో ప్రేమగా కలిసిపోయేట్లుగా ప్రవర్తిస్తుంటారు.