బాదామి గుహాలయాలు దక్షిణదేశపు ప్రధమ గుహాలయాలుగా ప్రసిద్ధి చెందినవి. బాదామిలో  మహావిష్ణువునకు  రెండు ఆలయాలు, పరమశివుని కి ఒకటి, మరియు, చమణులకు ఒకటి అని మొత్తం  నాలుగు ఆలయాలను
ఎఱ్ఱ ఇసుక  ( రెడ్ సాండ్ స్టోన్) రాళ్ళతో  చాళుక్యులు 6 వ శతాబ్దంలో  నిర్మించారు. ఇవి మొదటి పులకేశి మహారాజుచే ఆరంభింపబడి
మంగళేశ మహారాజు కాలంలో పూర్తి చేయబడినవి.

ఒక్కొక్క గుహాలయము  ముఖ మండపము, మహామండపం, చిన్న గర్భగుడి కలిగి  వున్నవి.

ఈ గుహాలయాల శిల్ప సౌందర్యం ఎంతో ఆకర్షణీయము.

మొదటి గుహాలయం…

పరమశివునికి అర్పించిన ఆలయం. 18 హస్తాలతో దర్శనమిచ్చే నటరాజస్వామి విగ్రహం చాలా ప్రఖ్యాతిగాంచిన శిల్పం గా పరిగణించబడుతున్నది. సాధారణంగా
ఆగమశాస్త్రాలలో, శిల్పశాస్త్రంలో నటరాజస్వామి విగ్రహం 16 చేతులుగలదిగా వివరించబడినది.
కాని చాళుక్య శిల్పులు  భరతనాట్యంలో తెలియచేయబడిన అన్ని నటన భంగిమల ముద్రలను 18 హస్తాలు గల  ఒకే విగ్రహంలో మలిచారు. దక్షిణదేశపు తొలిదశ   నటరాజస్వామి శిల్పాలలో యిది ఒకటి. ఇక్కడ వున్న హరిహర శిల్పం ఒక కుటుంబ చిత్రాన్ని చూస్తున్నట్లు వుంటుంది. కుషాణులు, గుప్తులు, కదంబుల కాలంలో హరిహర శిల్పాలు  వున్నా,  శ్రీహరి  లక్ష్మీ దేవితో మరియు గరుడవాహనంతోను, పరమేశ్వరుడు పార్వతీదేవి, తన వాహనమైన నందితోను గల  శిల్పాలను భారత దేశమంతటికి
ఇక్కడ మాత్రమే ఉన్నట్లు చెపుతారు.
అర్ధనారీశ్వరుడు , భృంగి మహర్షి, నంది  శిల్పాలు  కూడా రమణీయంగా చెక్కబడి వున్నవి.

ఆలయం లోపలి కప్పు పై ఆదిశేషువు
వ్యత్యాసంగా దర్శనమిస్తున్నాడు. రెండు  చేతులలో దంతము , మోదకం ధరించి సుఖాశీనుడైన  ఎఱ్ఱ వర్ణ గణపతి, మయూర వాహనంపై కుమారస్వామి మొదలైనవారి శిల్పాలు రంజింప చేస్తాయి.

రెండవ గుహాలయం…

మహావిష్ణువుకై అర్పించబడినది. ఒక చేత భూదేవిని ధరించి కాలిక్రింద హిరణ్యాక్షుని అణగత్రొక్కుతున్నట్లు వరాహస్వామి శిల్పం మలచబడినది. దానికి సమీపమున సర్ప దేహంతో మానవ శిరస్సు కలిగి ముకుళిత హస్తాలతో వుండే నాగరాజు శిల్పం వున్నది.

త్రివిక్రముని శిల్పంలో ఒక  కాలిక్రింద వామనుడు ఛత్రము పట్టుకొని నిలబడగా మరియొక కాలిని మహా బలి పట్టుకొని వ్రేలాడుతున్నట్లు, ప్రక్కనే వేదపండితులు యాగానికి కావలసిన  మంగళ ద్రవ్యాలు పట్టుకొని నిలబడి వుండే శిల్పాలున్నాయి. స్ధంభాలపై కార్తికేయుడు, లకులీశా, బ్రహ్మ, ఇంద్రుని రూపాలు , ముఖ మండపం లోపలి కప్పుపై మత్స్య చక్రం, స్వస్తిక్ రూపాలు దర్శనీయం.

మూడవ గుహాలయం..

578 లో ఈ గుహాలయం నిర్మించబడినది. ఈ గుహాలయం సుందరమైన, సున్నితమైన  పనితనంతో  దర్శనమిచ్చే అతి పెద్ద గుహాలయం. ఇక్కడ సంస్కృత శిలాశాసనం వున్నది. యీ శాసనంలో యీ గుహను గురించిన విషయాలు వున్నవి. గుహయొక్క ఎడమ ప్రక్క గోడపై అష్ట భుజ విరాట్ విష్ణువు తన చేతులలో ఎనిమిది విధాల ఆయుధాలు కలిగి వున్నాడు.

తరువాత ఆనంద విష్ణువు. ఆదిమూర్తి ,పరవశ దేవుడని  పిలవబడే  వైకుంఠ విష్ణు శిల్పం. ఇది వాసుకిపై వున్న భంగిమ. తరువాత వరాహస్వామి శిల్పం వున్నది.

పశ్చిమ దిశ గోడపై 12 అడుగుల  ఎత్తైన హరి హరుల శిల్పం వున్నది. దాని ప్రక్కన నిలబడిన  భంగిమలో నరసింహ స్వామి రూపం అత్యద్భుతంగా, జీవ కళతో
మలచిన విధానం అద్వితీయం.

సభామండపంలో లోపలి కప్పుపై ఇంద్రుడు, వరుణుడు, అష్ట దిక్పాలకులు, మన్మధుడు , శివ పార్వతుల వివాహ దృశ్యం,  గంధర్వుల శిల్పాలు వున్నవి.

నాలుగవ  గుహాలయం…

ఇది చమణుల ఆలయం . సింహాసనంపై ఆశీనుడైన భంగిమలో మహావీరుని శిల్పం  వున్నది. బాహుబలి, ఇతర తీర్ధంకరుల శిల్పాలు వున్నవి. గుహాలయాలే కాకుండా, భూతనాధుని ఆలయాల వరుస, ఉత్తరదిశ కొండ పైన, క్రిందన శివాలయాలు  బనశంకరి ఆలయం, వస్తు ప్రదర్శన శాల వంటివి ముఖ్యాకర్షణలు.

సున్నితమైన సునిశీత శిల్పకళా నైపుణ్యంతో అపురూప శిల్ప సంపదతో పరవశింపచేసే బాదామి గుహాలయాలలో ఆగమశాస్త్ర విధి విధానాలతో 16 రకాల పూజలు  రాజవంశీకుల ఆధ్వర్యంలో జరిపినట్లు తెలుస్తున్నది.

బెంగళూరు నుండి 447 కి.మీ దూరంలో బాదామి గుహాలయాలు వున్నవి.