ఆరోగ్యానికి కషాయాలు

వృక్షసంబంధ ధాతువులు శరీర నిర్మాణానికి, అనారోగ్యాల నుంచి రక్షణ నిచ్చే కవచాలుగా ఉపయోగపడతాయి. సిరిధాన్యాలతో పాటు కషాయాలు తీసుకోవడం వల్ల ఉద్భవించే రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుంది.

జంతు సంబంధ మాంసకృత్తులు లభించే పాలలో విషతుల్య పదార్ధాలు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. అధిక పాల దిగుబడి కోసం ఆక్సీటోసిన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు ఇవ్వడంతో ఇవి మనకు మేలు చేయడం కన్నా కీడు చేస్తున్నాయి. అందువల్ల వీటిని తీసుకోవడం మంచిది కాదు.

ఔషధ మొక్కల ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం ఎంతో మంచిది.

కషాయాలను తయారు చేయడం అంటే ఏదో ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో పెద్ద పరిమాణంతో ఆకులను, నీటిని పోసి ఉడకబెట్టడం కాదు. మనకు కావాల్సిన ఏదైనా ఒక మొక్కకు చెందిన 4 ఆకులతో తయారు చేసుకోవాలి.

వాటిని 150-200 గ్రాముల నీటిని పోసి 3-4 నిముషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి గోరువెచ్చగా తాగొచ్చు. పరగడుపున, సాయంత్రం వేళల్లో కడుపు ఖాళీగా వున్నప్పుడు తాగాలి.

ఈ కషాయంలో… పాలు, పంచదార, బెల్లం, తేనె కలపరాదు. తాటిబెల్లం పానకం కలుపుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు.

గోంగూర ఔషధపరంగా ఎంతో మేలైనది. దీని ఆకుల్లో గొప్ప ఔషధశక్తి ఉంది.

గోంగూర ఆకులతో కషాయం తాగితే మహిళల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

నిమ్మగడ్డి ఒక వారం, పుదీన ఆకులతో ఒక వారం, తులసి ఆకులతో ఒక వారం, అరికల పొట్టుతో ఒకవారం కషాయం తయారు చేసుకొని తాగటం వల్ల అనారోగ్యాలు దరిచేరవు.

కొత్తిమీరతో ఒక వారం ఇంట్లోనే కషాయం చేసుకొని… వడ కట్టుకొని తాటిబెల్లం పానకం కలుపుకొని తాగటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కషాయాలను ఉదయం పరగడుపున, సాయంత్రం వేళల్లో తాగాలి. తాగాలనిపిస్తే మధ్యలోనూ తాగవచ్చు. వారానికి మించి ఏ కషాయాన్నీ తాగవద్దు, వారాల తరబడి తాగకూడదు. అలా చేస్తే ఆ కషాయం కూడా కాఫీ / టి / మద్యం / గుట్కా మాదిరిగా చెడు అలవాటుగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

సిరిధాన్యాలు, కషాయాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సిరిధాన్యాలు ఆహారంగా తీసుకుంటూ, కషాయాలు తాగుతూ, అరగంట పాటు నడిస్తే ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. సిరిధాన్యాలు తినటం ప్రారంభిస్తే అప్పటికే ఉన్న రోగాలూ కొద్ది వారాల్లోనే ఉపశమిస్తాయి. 6 నెలల నుంచి రెండేళ్లలోపు పూర్తిగా తగ్గిపోతాయి.

ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. ప్రత్యేకించి చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయి. లేదా యోగా చేయడం ఉత్తమం. లేదా రోజూ గంటసేపు నడిస్తే ఎంతో మంచిది. వేగంగానే నడవాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా నడచినా ఫర్వాలేదు. నడవడం మాత్రం ముఖ్యం. రోజులు గడిచే కొద్దీ వేగం పెంచుకోవాలి.

పశువుల పాలు తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రోగాలు వస్తున్నాయి. అందువల్ల పాలు తాగడం మానెయ్యాలి. కాఫీ, టీలు కూడా తాగవద్దు. పెరుగు మజ్జిగ చేసుకుని తాగవచ్చు. పాలకు బదులు నువ్వులు, సజ్జలు, కుసుమలు, పచ్చి కొబ్బరితో పాలు తయారుచేసుకుని తాగడం మంచిది.

ఈ పాలను గిన్నెలో పోసి నేరుగా మరగబెట్టరాదు. మరో గిన్నెలో నీరు పోసి దానిలో ఈ పాలున్న గిన్నెను ఉంచాలి. కింద గిన్నెను వేడిచేయాలి.. ఆ గిన్నెలో నీరు వేడెక్కి పాలు కూడా వేడెక్కుతాయి. వాటిని గోరువెచ్చగా తాగవచ్చు. కాల్షియం కోసం వారానికి ఒక నువ్వుల లడ్డు తింటే చాలు.