ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో – మాసానాం మార్గశీర్షోహం – అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలు అవుతుంది. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇది అని అందరు చెప్తూ ఉంటారు.

పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం , జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం …. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.

అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో , సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీమహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో , అదే విధంగా దేవతలకు బ్రాహ్మీముహూర్తమైన ఈ మాసమంతా దేవతలు , ఋషులు , యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం , కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి.