ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్నాయి పార్టీలు. ఎప్పటి నుంచో ప్రధాన పార్టీలన్నీ ప్రచార బరిలోకి దిగిపోయాయి. వైసీపీ వచ్చేసి అభ్యర్థుల జాబితాను ఫినిష్ చేసే పనిలో ఉంటే.. టీడీపీ, జనసేనలు సీట్ల పంపకాలు పూర్తి అయితే చేసుకున్నాయి కానీ బీజేపీ పొత్తు అంశం తేలే వరకూ ఏ విషయాన్ని బయటకు రానివ్వకూడదని డిసైడ్ అయినట్టున్నాయి. ఈ విషయం కూడా డిసైడ్ అయితే ఈ మూడు పార్టీలు కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ప్రచారంపై ఫోకస్ పెడతాయి. ఇక షెడ్యూల్ ఎప్పుడు అన్నది కూడా పార్టీలకు అంతో ఇంతో క్లారిటీ ఉండే అవకాశం ఉంది. వచ్చే నెల 9న షెడ్యూల్ విడుదలవ్వొచ్చని నిన్న మొన్నటి వరకూ టాక్ నడిచింది.

ఏప్రిల్ 19న పోలింగ్..

తాజాగా ఒక షెడ్యూల్ అయితే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్ ప్రకారం.. వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 28న నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం స్క్రూటినీ, నామినేషన్ ఉపసంహరణ వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుందట. మే 22న కౌంటింగ్ జరగనుందని సమాచారం. మే 30న కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువుదీరనుందని తెలుస్తోంది. ఇది నెట్టింట వైరల్ అవుతున్న షెడ్యూల్. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇదే ఫైనల్ అన్నట్టుగా వైరల్ అవుతోంది. అయితే షెడ్యూల్ దీనికి అటు ఇటుగా ఉండే అవకాశమైతే ఉంది.

పూర్తి స్థాయిలో ఎన్నికలపైనే ఫోకస్..

కాస్త డేట్స్ అయితే మారొచ్చేమో కానీ ఈ సమయానికి నోటిఫికేషన్ రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. అంటే నోటిఫికేషన్ రావడానికి కనీసం నెల రోజులు కూడా సమయంలేదు. ఇప్పటి వరకూ పొత్తులే ఫిక్స్ అవకుంటే టీడీపీ, జనసేన, బీజేపీలు ఎప్పుడు అభ్యర్థులను ఫిక్స్ చేస్తాయి? ఎప్పుడు ప్రచార బరిలోకి వెళతాయి? కాబట్టి వీలైనంత త్వరగా పొత్తులు తేల్చేయాలని పార్టీల నేతలు సైతం కోరుతున్నారు. అయితే అధినేతలంతా పూర్తి స్థాయిలో ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరిట సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ‘శంఖారావం’ పేరిట సభలు నిర్వహిస్తున్నారు. ఇక జగన్ ‘సిద్ధం’ పేరిట సభలు నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చేసి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే పనిలో ఉన్నారు.