localnewsvibe

గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ అడవిలోకి…

Caption of Image.

బైక్‌‌పై మంచిర్యాల నుంచి ఖమ్మం బయలుదేరిన యువకుడు
గూగుల్‌‌ మ్యాప్‌‌ షార్ట్‌‌ కట్‌‌ చూపడంతో భూపాలపల్లి జిల్లాలో అడవిలోకి…
అర్ధరాత్రి కావడం, బైక్‌‌ రిపేర్‌‌కు రావడంతో 100కు ఫోన్‌‌ చేసిన వ్యక్తి
రెండు గంటలు వెతికి యువకుడిని కాపాడిన కొయ్యూరు పోలీసులు

మల్హర్, వెలుగు : గూగుల్‌‌ మ్యాప్‌‌ను నమ్ముకొని బైక్‌‌పై బయలుదేరిన ఓ వ్యక్తి అడవిలో చిక్కుకున్నాడు. అర్ధరాత్రి కావడం, బైక్‌‌ రిపేర్‌‌కు రావడంతో ఏం చేయాలో తోచక 100కు డయల్‌‌ చేశాడు. పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్‌‌ మండలంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం జిల్లాకు చెందిన జస్వ అనే వ్యక్తి బుధవారం బైక్‌‌పై మంచిర్యాల వెళ్లి తిరిగి ఖమ్మం వైపు వస్తున్నాడు.

 రూట్‌‌ తెలుసుకునేందుకు గూగుల్‌‌ మ్యాప్‌‌ ఆన్‌‌ చేసుకొని మంచిర్యాల నుంచి బయలుదేరాడు. మల్హర్‌‌ మండలం కిషన్‌‌రావుపల్లి వద్దకు రాగానే ఫారెస్ట్‌‌ రూట్‌‌లో తక్కువ కిలోమీటర్లు చూపించడంతో బైక్‌‌ను అటువైపు మళ్లించాడు. అయిత్‌‌ కిషన్‌‌రావుపల్లి – భూపాలపల్లి మార్గంలో ఫారెస్ట్‌‌ రూట్‌‌ మొత్తం మట్టి రోడ్డు అనే విషయం తెలియని జస్వ బైక్‌‌ నడుపుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడు. 

అలాగే ముందుకు వెళ్తున్న క్రమంలో బైక్‌‌ క్లచ్‌‌ ప్లేట్స్‌‌ డ్యామేజ్‌‌ అయ్యాయి. అప్పటికే అర్ధరాత్రి 12 అవుతుండడం, బైక్‌‌ నడిచే పరిస్థితి లేకపోవడంతో 100కు డయల్‌‌ చేసి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న కొయ్యూరు ఎస్సై నరేశ్‌‌ సిబ్బంది, స్థానికులతో కలిసి అడవిలోకి వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు వెతకగా జస్వ జాడ దొరికింది. జస్వతో పాటు అతడి బైక్‌‌ను ట్రాక్టర్‌‌లో కొయ్యూరు తీసుకొచ్చారు. ఎస్సై నరేశ్‌‌ జస్వ బైక్‌‌ను రిపేర్‌‌ చేయించిన అనంతరం ఖమ్మం పంపించారు.

©️ VIL Media Pvt Ltd.