మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ ఉపదేశించిన మంత్రం…

నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే…
య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్

ఇది శివపురాణంలో కూడా  వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.

1) నమశ్శివాయ…

(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.

అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన  ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం.  పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.

2) సాంబాయ…

అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే  కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.

3) శాంతాయ…

ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే. “ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే” అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.

4) పరమాత్మనే నమః…

చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే… అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం.

ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు  మహర్షి స్వయంగా చెప్పారు.