localnewsvibe

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం నుంచి సోమవారం ఉదయం వరకూ తెలంగాణలో ఎక్కడ చూసినా భారీ వర్షాలే.

ముఖ్యంగా ఖమ్మం జిల్లా అయితే వరదల ధాటికి అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు ఏకమై పొంగిపొర్లి.. గ్రామాలు, కాలనీల్లోని లోతట్లు ప్రాంతాలను ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు ధ్వంసం కావడం, మరోవైపు రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో జనాలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలు దాదాపు బంద్ అయ్యాయి. ఖమ్మం నుంచి బయటికి రాలేని పరిస్థితి.. అక్కడి నుంచి ఎటూ వెళ్లలేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాల్లో వాగులు వంకలు ఉరకలెత్తడంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.

కొన్నిప్రాంతాల్లో చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా, పలుచోట్ల నీటివనరులకు గండి పడి పంట పొలాలలను నాశనం చేశాయి. వరుణ ప్రతాపానికి కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎటు చూసినా కనుచూపుమేరలో వరద నీరు కనిపిస్తోంది.

మహబూబాబాద్ నుంచి నలువైపులా రాకపోకలు స్తంబించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు త్వరితగతిన నష్టం అంచనా వేసి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

అధికారులు తక్షణం చొరవచూపి సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కుండపోత వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలన్ గొందిలో వరద ధాటికిలో లెవల్ వంతెన కొట్టుకుపోయింది. రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు.

జిల్లా పాలనాధికారి వెంకటేశ్ దోత్రే ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. మున్నేరు వాగు ఉప్పొంగి మూడు రోజులుగా ఖమ్మం వాసులు వరదనీటిలోనే ఉండిపోయారు.

సోమవారం నాడు వరద కాస్తా తగ్గుముఖం పట్టడడంతో తమ తమ ఇళ్లకు చేరుకొని జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇళ్లలో మోకాళ్ల లోతులో కూరుకుపోయిన బురదను ఎత్తిపోసే పనిలో నిమగ్నమయ్యారు.

నిత్యావసరాలు, విద్యార్థుల సర్టిఫికెట్లు,ఇళ్లలోని టివిలు, ఫ్రీజ్‌లాంటి వస్తువులు పూర్తిగా తడిపిపోవడంతో భారీగా నష్టం వాటిల్లింది.