తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు.

అయితే నంబర్ వన్ సిటీగా నిలవాలనుకుంటున్న మన నగరం మాత్రం పెను ప్రమాదంలో పడింది. హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత కాలుష్య నగరం. గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్‌పీస్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెంగళూరు, కొచ్చి, చెన్నైలతో పోల్చితే హైదరాబాద్‌లో 2.5 PM కాలుష్య కారకాలు ఉన్నట్లు తేలింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన ప్రమాణాల కంటే మన నగరంలో కాలుష్యం 14 రెట్లు ఎక్కువగా విడుదలవుతోంది. ప్రపంచ వాయు నాణ్యత సూచీలో కాలుష్య నగరాల జాబితాలో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్‌లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలో బంజారాహిల్స్, కేపీహెచ్‌బీలు ముందున్నాయి. బంజారాహిల్స్‌లో 127, కేపీహెచ్‌బీలో 124, జూపార్క్‌లో 144, సైదాబాద్‌లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకుంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లోనూ వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది.

దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్‌కతా, హైదరాబాద్ ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండడం గమనార్హం. మన నగరంలో ప్రతిరోజూ 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండడంతో కాలుష్యం పెరుగుతోంది.