మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూరియా పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా టాస్క్ బృందాలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా రాయితీ యూరియాను రైతులకు అందిస్తుందని, ఇదే అదనుగా నకిలీ యూరియాను తయారుచేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ చర్యలు నివారించేందుకు మండల, డివిజన్, జిల్లాస్థాయి బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.
మండల స్థాయి బృందంలో తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారని, డివిజన్ స్థాయి బృందంలో రాజస్వ మండల అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, ఎ. సి. పి./ డి. ఎస్. పి. ఉంటారని, జిల్లా స్థాయి బృందంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా వ్యవసాయ అధికారి, డి. సి.పి. ఉంటారని తెలిపారు.
బృంద సభ్యులు తమ పరిధిలోని అనుమానిత తయారీ కేంద్రాలు, అనధికారక డి.ఈ.ఎఫ్. ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని, తనిఖీల సమయంలో అనుమానిత యూరియా నిల్వలు లభించినట్లయితే స్వాధీన పరుచుకోవాలని, యూరియా నమూనా సేకరించి వేప నూనె పూత ఉండడంపై ల్యాబ్ పరీక్ష నిర్వహించాలని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బృంద సభ్యులు తాము తనిఖీ చేసిన నివేదికలు ప్రతివారం జిల్లా వ్యవసాయ అధికారికి తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు.
