మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:28 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి మండలం, లంబాడితండా గ్రామానికి చెందిన రంగా రాజేశ్వరి అనారోగ్యంతో పరమపదించిన పిదప వారి కుమారుడు రంగా ప్రశాంత్ తమ తల్లి నేత్రాలను దానం చేయాలని మహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని లయన్స్ క్లబ్ బెల్లంపల్లి కార్యదర్శి ఆదర్శ్ వర్ధన్ రాజు దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ అధికారులతో సంప్రదించి నేత్రదానానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ నేపధ్యంలో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నుండి ప్రసాద్ స్వయంగా గ్రామానికి వచ్చి, నేత్రాలను భద్రపరచి వారి కుటుంబానికి ధన్యవాదములు తెలుపుతూ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ పుణ్యకార్యంలో సహకరించిన లయన్ కట్కూరి సత్యనారాయణ, రెడ్ క్రాస్ ప్రతినిధి సురభి శరత్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులు రాజేశ్వరి కుటుంబ సభ్యులను అభినందిస్తూ, వారు చేసిన నేత్రదానం నిర్ణయం పలువురికి చూపును ప్రసాదించే దాతృత్వానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
