మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

తాండూరు: మంచిర్యాల జిల్లా, తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన తాండూర్ (ఐబీ)ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా విలేకరుల సమావేశంలో తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రంలోని ఏడు లక్షల పైచిలుకు ఆటో కార్మికులకు గొడ్డలిపెట్టుగా మారి ఇప్పటివరకు 87మంది ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలను కనీసం పరామర్శించడానికి కూడా రాని ప్రభుత్వ పెద్దలు ఆర్థికంగా నిలదొక్కుకున్న ఆర్టీసీకి అదనంగా 200 కోట్లు వచ్చాయని పండుగ చేసుకోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తపరిచారు.

ఆటో కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో సంవత్సరానికి 15 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాము. అయినా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పదివేల కోట్ల రూపాయలతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అడిగిన పట్టించుకోక పోగా 2023 ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని మభ్యపెట్టి మాతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ప్రభుత్వం ఏర్పడి 19 నెలల గడిచిపోయిన ఇప్పటివరకు ఆటో కార్మికుల ఊసు ఎత్తకపోగా ఆటో డ్రైవర్ల సమస్యలు విన్నవించుకోవడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్లినా, ఆటో కార్మిక నాయకులతో బస్సు ఏమైనా ఇంటి వరకు వెళ్తుందా, అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నా, పట్టించుకోని ప్రతిపక్ష నాయకులకు, పాలక పక్ష నాయకులకు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో గనుక ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు మరియు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా గురించి ఆటో కార్మికులకు ఇస్తానన్న సంవత్సరానికి 12వ వేల రూపాయలు ఈ మూడు అంశాలపై చర్చించకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఆటో కార్మికుల సత్తా ఏంటో చూపిస్తామని, స్పందించకపోతే ఆటో కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అన్ని కార్మిక సంఘ నాయకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చాంద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, కార్యనిర్వాహక సభ్యుడు ఆశుం అలీ,తోటి ఆటో కార్మికులు పాల్గొన్నారు.