మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 30 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి సంబరాలు అంటూ సభలు పెట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా నాయకులు విమర్శించారు.
బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళ నాయకురాలు మాసాడి శ్రీదేవి మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఇందిరా మహిళ శక్తి సంబరాలు కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వెనుక వరుసలో కూర్చోబెట్టడం దారుణమని అన్నారు.
మహిళల కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 23 గ్రామ మహిళ సమైక్య భవనాలు, ఐదు మండల మహిళా సమైక్య భవనాలు మంజూరు చేయడమైనదని గుర్తు చేశారు. వాటికీ సంబంధించిన ప్రొసీడింగ్ సైతం రాగా అట్టి నిధులను వేరే పనులకు కేటాయించారని ఆరోపించారు.
కాబట్టి వచ్చే గాంధీ జయంతి లోపు మహిళ సమైక్య భవనాలను నిర్మించాలని లేనిపక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
అదేవిధంగా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సి మహిళలకు కేటాయించగా ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న ఇంత వరకు ఆ పదవిని కేటాయించకపోవడం సిగ్గు చేటని అన్నారు.
మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వంలో మహిళలకు పదవులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. మహిళలంటే ఉన్న చిన్నచూపుతోనే ఇంతవరకు పదవి భర్తీ చేయలేదని ఆరోపించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీ లేకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వంటా వార్పు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నేతలు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీలు జడ్పిటిసి, ఎంపీటీసీ లు రమాదేవి, శ్యామల,దుర్గం మంగ, గోమాస స్వాతి, డీ.స్వప్న, మంజుల తదితరులు పాల్గొన్నారు.
