మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:3 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్.పి.ఎఫ్.ఫంక్షన్ హాల్లో జిల్లా ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ ప్రతీ ఫోటో, వీడియో గ్రాఫరికీ కుటుంబ భరోసా అందడమే లక్ష్యంగా రాష్ట్ర యూనియన్ కృషి చేస్తుందని అన్నారు.ఆదివారం అసోసియేషన్ నూతన అధ్యక్షుడు అప్పాసు రాము, ప్రధాన కార్యదర్శి శ్వాస తిరుపతి, కోశాధికారి ముక్కెర స్వామిలతో మూడేళ్ల పదవిలో ఫోటో, వీడియో గ్రాఫర్లకు అందుబాటులో ఉంటూ సంక్షేమానికి కృషి చేయాలంటూ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఫోటో మాంత్రికుడు డ్యాగురే చిత్ర పటానికి పూలమాల వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన గావింంచారు.

ఈ సందర్భంగా మృతి చెందిన ఫోటో,వీడియో గ్రాఫర్ల ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా మాజీ భాధ్యులు తమ భాధ్యతలను నూతన కార్యవర్గానికి అప్పగించిన అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడుతూ, ప్రతీ ఫోటో, వీడియో గ్రాఫర్ అభివృద్ది, సంక్షేమానికి రాష్ట్ర యూనియన్ భాధ్యతగా తీసుకుంటుందని అన్నారు. ఇకపై రాష్ట్ర యూనియన్ నుంచి నీట్, ఐఐటీలో సీటు సాధించే పిల్లలకు రూ. 5 వేలు, ఫోటో,వీడియో గ్రాఫర్ కుటుంబ పెద్దగా ఉండి మరణిస్తే ఆ కుటుంబంలోని పిల్లలకు రూ.5 వేలు ఇలా ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. ప్రధానంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఫోటో, వీడియో గ్రాఫర్ల కుటుంబ భరోసా పథకం ద్వారారూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలియజేస్తూ జిల్లా అసోసియేషన్ పటిష్టంగా ఉంటూ ఫోటో, వీడియో గ్రాఫర్లకు చేయూతగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి, ఉపాధ్యక్షులు మహేశ్, ఉదయ్, మహిళా అధ్యక్షురాలు జయమాధురి, మహిళా ఉపాధ్యక్షురాలు ఆశాల శారద, దక్షిణ భారత ప్రతినిధి రాజేశ్వర్రెడ్డి, మాజీ గౌరవ అధ్యక్షుడు ఎంకే.రాము, మాజీ ఉపాధ్యక్షుడు కనకయ్యగౌడ్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.