✍️ రచన: సీనియర్ జర్నలిస్టు చిర్రా శ్రీనివాస్ గౌడ్
1981లో మణుగూరు రోడ్లమీద నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలతో పెద్దగా కనిపించే ఒక పేరు – “బాబు ఆర్ట్స్”. ఈ పేరు తెలియని వారు అప్పట్లో మణుగూరులో ఉండే వారు కాదు. ఈ పేరు వెనుక ఉన్నాడు – మణుగూరు మండలానికి చెందిన ఓ సాధారణ పెయింటర్ బుర్ర బాబు గారు, కానీ ఆయన చేతి ఆకారం అసాధారణం.
అప్పట్లో ఫ్లెక్సీలు, డిజిటల్ బోర్డులు మరియు సైన్ బోర్డులు , కంప్యూటరైజ్డ్ ప్రింటింగ్ ఎవరూ ఊహించని రోజులు. అప్పుడే ఓ రోడ్డు పక్కన, రోల్ వేసుకొని, తన చిన్న స్టూల్ మీద కూర్చొని చేతిలో చిన్న బ్రష్ పట్టుకొని అక్షరాలని చిత్రాలలాగా గీసే కళాకారుడు బాబు. తను రాస్తే ఇది బాబు “బాబు ఫాంట్” అనేలా, ఆయన అక్షరాలు కూడా ఆయనకే ప్రత్యేకం.
మణుగూరులోని గోల్డ్ షాప్ లైన్ లో ఒకటి కాదు, రెండు కాదు – ప్రతి షాపు పేరు మీద ఆయన శిల్పకళ వెలుగొందింది. కిరాణా షాపులు, హోటళ్ల బోర్డులు, థియేటర్ పోస్టర్లు, పాఠశాల గోడలు – అన్నింటిపైనే బాబు గారి ముద్ర ఉండేది. “పెయింటర్ అంటే బాబేనయ్యా” అనే మాట అప్పుడు మణుగూరు ప్రజల నోట వినిపించేది.
ఆయన పేరు చెప్పగానే గుర్తొస్తాయి – తెల్ల రంగులో శుభ్రమైన అక్షరాలు, వాటి చుట్టూ ఎరుపు/నీలం షేడింగ్, మధ్యలో చిన్న చిన్న డిజైన్లు. ఆయన చేతికాలక్షరం ముందు కంప్యూటరే అయినా బాబు ఫాంట్ అక్షరాన్ని పోలి రాయలేకపోయేది. అప్పట్లో ఆయన దగ్గర ఆర్డర్ పడటం అంటే గర్వకారణం.
కాలం మారింది. ఇప్పుడు డిజిటల్ ఫ్లెక్సీలు, అన్‌లిమిటెడ్ ఫాంట్లు, తక్కువ ఖర్చు. కానీ కళ మాత్రం అసలుండదు. బాబు గారి వయసు పెరిగింది. కళలో ఉన్న వేగం తగ్గిపోయింది. “ఇప్పుడు చేయడం కుదరదు నాయనా, చేతులు నొప్పి వస్తున్నాయి కళ్ళు కనబడటం లేదు” అని ఆయన మనస్పూర్తిగా చెబుతారు. కానీ అప్పట్లో రాయించిన వాళ్లు – ఇంకా ఇప్పటికి కూడా అడుగుతున్నారు అంట – “మీ శిష్యులు ఎవరైనా ఉంటే చెప్పండి అని, ఆ శైలి మేము మర్చిపోలేం” అని.
ఈ రోజు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆయన కన్నులో ఒంటి వెలుగు, గర్వం కనిపించింది. “నాకు పేరు ఇచ్చింది ఈ మణుగూరే… నేను పెయింట్లు ఆపినా… బాబు ఆర్ట్స్ గుర్తుండిపోతుంది” అన్నారు.
మన మణుగూరులో “బాబు ఆర్ట్స్” పేరున ఓ కళాపరంపర నిలిచింది. గడచిన రోజుల జ్ఞాపకాల్లో బాబు గారి బోర్డులు ఒక భాగం. మీ దగ్గర కూడా ఏదైనా బాబు గారు రాసిన బోర్డు, గుర్తింపు ఉంటే, దయచేసి ఈ కథనానికి జతచేయండి. మన పిల్లలకు చూపించాల్సిన గౌరవ చిత్రకారుడు బాబు గారు – మణుగూరు కళాసంస్కృతికి నిలువెత్తు గుర్తింపు.
✒️ మీ – చిర్రా శ్రీనివాస్ గౌడ్
సీనియర్ జర్నలిస్ట్ – మణుగూరు
